Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటింగ్ పెట్టకుండా తప్పించుకున్న బీజేపీ... మనీ బిల్లా? కాదా? అన్నది తేల్చడానికి లోక్ సభ స్పీకర్ కు వెళుతున్న బిల్లు!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ బీజేపీ ప్రస్తుతానికి గట్టెక్కింది. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరిగిన వేళ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ద్రవ్య బిల్లుగా పేర్కొంటూ అభ్యంతరాలు లేవనెత్తగా, వాటి ప్రాతిపదికన లోక్ సభ స్పీకర్ కు రిఫర్ చేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ రూలింగ్ ఇచ్చారు. బిల్లుపై ఇప్పుడు ఓటింగ్ పెట్టాలని కోరుతున్న సభ్యులను వారిస్తూ, బిల్లుపై చర్చ ముగిసిందని, ఆర్థిక మంత్రి లేవనెత్తిన అభ్యంతరాలను తీర్చిన తరువాతనే ముందుకు వెళ్లగలుగుతానని కురియన్ వ్యాఖ్యానించారు. ఒక బిల్లు మనీ బిల్లు అవుతుందా? కాదా? అన్న విషయాన్ని తేల్చే హక్కు తనకు లేకపోయిందని, ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ దే తుది నిర్ణయమని రాజ్యాంగ నిబంధనలను ఉటంకించారు. సభ్యులకు అనుమానాలు ఉన్నాయని, తనకూ అనుమానం ఉందని స్పష్టం చేసిన ఆయన బిల్లును లోక్ సభకు పంపుతున్నట్టు తెలిపారు. తుది నిర్ణయాధికారం స్పీకర్ దేనని స్పష్టం చేశారు.

More Telugu News